X

జాబిలి కోసం జాగారం

వినాయక చవితి సందర్భంగా మా అపార్ట్మెంట్ లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని నేను చేసిన కార్యక్రమం
జాబిలి కోసం జాగారం” మీకోసం.

============
మీ అందరికీ నా నమస్కారాలు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు.
నమస్కారంతో పాటు సంస్కారాన్ని నేర్పిన నా తల్లిదండ్రులకు, గురువులకు, బంధుమిత్రులకు నా కృతజ్ఞతలు.

నన్ను ముందుకు నెట్టి
నా ప్రదర్శన ఎలా ఉంటుందో అని ఉత్కంఠతో ఊపిరి బిగబట్టి
స్టేజి మీద కాలు పెట్టి
ఈ మైకు పట్టి

నేను మీ ముందుకు రావడానికి కారణమై, నన్ను ప్రోత్సహించిన మీలో ఉన్న కొందరికి నా ధన్యవాదములు

ప్రతి ఒక్కరిలోనూ ఒక కళాకారుడు ఉంటాడు. సాధారణంగా కళలు మొత్తం 64 .
64 కలలను నేను ప్రదర్శించాలని అనుకోలేదు. ఇక్కడ మీరిచ్చిన ఐదారు నిమిషాలలో నాలోని రెండు కళలను మాత్రమే, కవిత్వం సంగీతం కలగలిపి “జాబిలి కోసం జాగారం” అనే కార్యక్రమం మీ అందరి కోసం.

ఇది కేవలం కల్పితం. సరదాగా, హాస్యభరితంగా ఓ అయిదు నిమిషాలు గడపాలని మాత్రమే.
సుత్తి లేకుండా సూటిగా కథలోకి వస్తే

నా 5 ఏళ్ల వయసు అప్పుడు మా అమ్మ గోరుముద్దలు తినిపిస్తూ అందమైన అపద్దం చెప్తూ ఉండేది ఆ అపద్ధం ఏమిటంటే

చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగు పూలు తేవే
పల్లకిలో రావే పాలు పెరుగు తేవే
…………..
…………..
అన్నిటినీ తెచ్చి
మా అబ్బాయికి ఇవ్వవే

అని పాడుతూ ఉండేది.
కానీ చందమామ మాత్రం ఎప్పుడూ రాలేదు.
ఎప్పుడు ఆకాశంలో చూస్తూ ఉండేవాడు ఆశతో కాదు, ఆవేదనతో, చంద్రుడు రాలేదనే బాధతో.
రోజు ఏడుస్తూ ఉండేవాన్ని.

ఆ సంవత్సరంలో వినాయక చవితి వచ్చింది.
అప్పటికి కొద్దిగా చందమామ గురించి మర్చి పోయిన నాకు చవితి రోజు చంద్రుని చూడకూడదని మళ్లీ గుర్తు చేశారు మళ్లీ ఏడుపు మొదలైంది.
అలా ఏడుస్తూ ఉండగా మా అమ్మమ్మ ఏం చెప్పిందంటే “ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే మీ బాధను తన తీర్చగలడు” అని చెప్పగా గణపతిని ప్రార్థించా

దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా దయుంచయ్యా దేవా
నీ అండాదండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా
పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా
తండ్రివలె ఆదరించి తోడు నీడ అందించయ్యా

నా ప్రార్థన ఆ గణపతి మనసును కరిగించి,
అతను కరుణించి,
కదలి వచ్చి
నా ముందు ప్రత్యక్షమయ్యి
“భక్త ఏమి నీ కోరిక” అని అడగగా
“ఆకాశంలో ఉండే ఆ చందమామ కావాలని” కోరగా
గణపతి: “నన్ను చూసి నవ్వే ఆ చంద్రుడు అంటే నాకు ఇష్టం లేదు. అందని ఆ చందమామ కోసం ఆశ పడడం వృధా ప్రయత్నం. ఆకాశంలోని చందమామ కాకుండా ఇంకా వేరే ఏమైనా కోరుకో “

నాకు ఆ చందమామే కావాలి అంటే
గణపతి : “ఆ జాబిలి కంటే ఇంకా అందమైన మోము ఉన్న బాపు బొమ్మను ఇస్తాను.

ఆ చందమామ కొండెక్కి వచ్చి గోగుపూలు చేస్తాడో లేదో కానీ ఈ బాపు బొమ్మ జాజిపువ్వులతో నీ బండెక్కి నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తుంది.

ఆ చందమామ పల్లకిలో వచ్చి పాలు, పెరుగు చేస్తాడో లేదో కానీ ఈ బాపు బొమ్మ నీకు పాలు పెరుగుతో పాటు నెయ్యి, ఇంకా కావాలంటే కన్నీరు పెట్టకుండా పన్నీరు చేసిపెడుతుంది” అని
చెప్పి

సృష్టికర్త అయిన బ్రహ్మ ను సంప్రదించి “ఆకాశంలోని చందమామ కంటే అందమైన మచ్చలేని ప్రాణమున్న పసిడి బొమ్మను నా భక్తునికి సృష్టించి ఇవ్వమని” అడగగా
అప్పుడు ఆ బ్రహ్మ “గణేశా నీవు కోరుకున్నట్లే మూడు సంవత్సరములు ముందే దివ్యదృష్టితో దూరదృష్టితో మచ్చ లేని చందమామను సృష్టించాను. వివరాలను సందేశం రూపంలో నీ చరవాణికి చేరి వేస్తున్నాను” అని చెప్పగా

ఆ గణపతి బోసినవ్వుల బుజ్జాయి బొమ్మను చూపించి “ఇదిగో నీ జాబిలి” అని చెప్పగా
నాకు ఇప్పుడే కావాలి అంటే
గణపతి “దేవునికి ఎక్కడ ఎప్పుడు ఎవ్వరికి ఏమి ఇవ్వాలో బాగా తెలుసు. ఈ జాబిలి కోసం నువ్వు కొన్ని సంవత్సరాలు ఆగక తప్పదు” అని చెప్పగా
“ఒకవేళ గుర్తించాలంటే ఎలా గుర్తించాలి నా జాబిలిని” అని అడగగా

గణపతి : “ఇద్దరి కళ్ళల్లో చెప్పలేనంత ఆనందం, ఆశ్చర్యం.ఒకరి కళ్ళల్లోని మెరుపు, నవ్వులోని వెలుగు ఇంకొకరి ప్రశ్నలకి అడగకుండానే అందమైన సమాధానాల్ని చెప్పేసాయి.” అని చెప్పి అదృశ్యమయ్యాడు.

కౌమారం దశ నుండి యవ్వనం దశకు చేరుకుని నా జాబిలి కోసం అన్వేషణ ఆరంభించాను.
నా స్నేహితులకు అందరికీ వివాహాలు అవుతుండగా ప్రతి స్నేహితుని వివాహానికి హాజరయ్యే వాడిని కనీసం ఆ వివాహం లో నా జాబిలి దొరుకుతుందని. ఎ అమ్మాయి కళ్ళల్లో మెరుపు కనబడి కానీ నా ఆశ నెరవేరలేదు.

ఒకరోజు ఆకాశంలోని పున్నమి చంద్రుని చూసి వచ్చి నిద్ర పట్టక,
చిన్నప్పుడు ఆ గణేశుడు చూపిన బుజ్జాయి రూపంలో ఉన్న నా జాబిలి, ఇప్పుడు ఎలా ఉంటుందో ఒక బొమ్మను గీస్తే అనే ఆలోచనతో పికాసో, రవి వర్మలను ఆదర్శంగా తీసుకుని

బొమ్మను గీస్తే నీలా వుంది
దగ్గరకొచ్చి ఓ ముద్దిమ్మంది
సర్లే పాపం అని బొమ్మను గీసి దగ్గరికి వెళితే

ఆ బొమ్మను చూసి నా గుండె ఎన్ని ముక్కలు, చెక్కలు అయ్యిందో నేనే లెక్కపెట్టలేకపోయాను.ఆ రోజు అర్ధరాత్రి తర్వాత మూడు గంటల ముప్పై మూడు నిముషాల మూడు సెకన్లకి నా మూడు మారి నా మీద నాకే పిచ్చి కోపం వచ్చింది. ఇంక జీవితంలో బొమ్మలెయ్యకూడదని ఒక సంచలనాత్మకైన నిర్ణయం తీసుకున్నాను. అలా ప్రపంచం మొత్తం గాఢనిద్రలో వుండగా ప్రపంచానికి తెలీకుండానే ఓ గొప్ప చిత్రకారుడుని కోల్పోయింది.

ఒకవేళ నా జాబిలికి కవిత్వం మీద ఇష్టం ఉండి, నా అభిమానిగా మారి పరిచయం పెద్దయి, ఆమె చిన్నప్పటి ఫోటో ని పంపమని అడిగితే ఆ ఫోటో ద్వారా నా అన్వేషణ అంతం అవుతుందని పంతంతో నేను కవితలు రాసి పత్రికలకు పంపితే
కవితలన్నీ తిరుగుటపాలో ఇంటికి వస్తే సైకిల్ మీద బఠాణీలు అమ్మే అతనికి కిలోల లెక్కన ఇస్తే పావు కిలో బఠానీలు వచ్చాయి. వాటిని జేబులో వేసుకుని బఠానీలు నములుకుంటూ, నడుచుకుంటూ చుట్టుపక్కల ప్రదేశాలనుండి పట్టణాల వరకు
గుడిలో అడిగా గువ్వలనడిగా……

నిద్దర పోతున్న రాతిరినడిగా
గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా ఆ చందమామనడిగా
నా జాబిలి జాడ చెప్పరేమని

నా జాబిలి తలపులతో ఎన్నో తలుపులు తట్టి
ఎన్నో మలుపులు చుట్టి అన్ని దారులు వెతికి
ప్రపంచమంతా వెతకాలనీ వున్నా ఆర్థిక స్తోమత లేక
ఎన్నో రాత్రులు జాగారాలు నా జాబిలి జాడ తెలియక.

ఒక రోజు రాత్రి ఆ గణేశుడు నా కలలో ప్రత్యక్షమై “రేపు నీకు ఒక పెళ్లి సంబంధం వస్తుంది తప్పకుండా ఆ పెళ్లి చూపులకు వెళితే నీ జాబిలి కనపడుతుంది” అని చెప్పగా మరుసటి రోజు ఆ పెళ్లి చూపులకు వెళ్లగా అక్కడ ఆ అమ్మాయి కళ్ళల్లోనే మెరుపు చిరునవ్వులోని వెలుగు నాకు చక్కలిగింతలు పెడుతుంటే ఆ సంతోషాన్ని ఆపుకోకుండా తొలిప్రేమ సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా చెట్టు తొర్రలో ఆనందంతో ఎగిరి గంతులు వేయాలని పించింది కానీ వాళ్ళ ఇంటిదగ్గర చెట్టు ఉంది కానీ దానికి తొర్ర లేదు.

నా ఆనందాన్ని తిరుగు ప్రయాణంలో ఇదిగో ఈ పాట రూపంలో పాడుకుంటూ
======
భలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు
ఆఆఆఆయ్ వసంతాలు పూచే నేటి రోజు
గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు
గువ్వలైన ఆ కోరికలే గూటిలోన చేరిన రోజు
భలే మంచి రోజు పసందైన రోజు
వసంతాలు పూచే నేటి రోజు
ఆఆఆఆయ్ వసంతాలు పూచే నేటి రోజు
చందమామ అందిన రోజు బృందావని నవ్విన రోజు

====
పాణిగ్రహంతో నా జాబిలి నాకు చేరువై ఒక చిన్న కుటీరంలో జీవిత ప్రయాణం సాగిపోతున్నది. కొన్ని రోజుల తర్వాత నా జాబిలి 100% ఆనందంతో అన్ని సౌకర్యాలతో లేదని బాధనిపించింది. అప్పుడు గణేశుని ప్రార్ధించాను “స్వామి అక్కడ ఆ ఆకాశంలోని జాబిలికి పాలపుంత ఇచ్చావ్ ఇక్కడున్న నా జాబిలికి మళ్లీ మళ్లీ వెతికే పని లేకుండా అన్ని సౌకర్యాలు ఉండే మంచి ప్రదేశాన్ని ఇవ్వమని “ అడగగా
ఆ గణేశుడు గల్లి గల్లి తిరిగి seegahalli లో
అమరశిల్పి రమణ అన్న శ్రద్ధతో చెక్కిన శ్రద్ధ భవంతుల సముదాయం సరైన ప్రదేశం అని అక్కడ సౌకర్యాల గురించి పొగుడుతూ
(అపార్ట్మెంట్ పేరు Sradha white cliff, builder name is Ramana reddy).

శ్రద్ధ చంత లేదు ఇంక చింత
ప్రకారంలో ప్రశాంతత
జలాశయంలో ఈత
పర్వదినాలలో సంబరాల మోత
మనసంతా పులకింత
శ్రద్ధతో పోలిస్తే ఆ పాలపుంత ఇసుమంత

అప్పుడు నేను “స్వామి ఆకాశంలోని చందమామకి తారలను జతగా ఇచ్చావు ఇక్కడ నా జాబిలి ఒంటరి అవుతుందేమో” అనే నా సందేహానికి సమాధానముగా


శ్రద్ధాలో నడిచే నక్షత్రాలతో నీ జాబిలికి జత
అన్నయ్య గారు అని నీకు అంతులేని ఆప్యాయత”

అని చెప్పిన తర్వాత మేము ఇక్కడ రావడం జరిగింది. ఈ అపార్ట్ మెంట్లో ఉండే అదృష్టాన్ని గణపతి ప్రసాదించినందుకు కృతజ్ఞతలతో, మీకు వినాయక చవితి శుభాకాంక్షలతో

జై జై గణేశా
జై హింద్ గణేశా

— మీ రాజీ ప్రతాప్

Prathap Reddy:

View Comments (4)

Related Post