X

పెళ్లి రోజు శుభాకాంక్షలు-1

కొన్ని రొజుల క్రితం ఓ భర్త భార్యకు తెలిపిన పెళ్లి రోజు శుభాకాంక్షలు మీ కోసం
—————————–
మనసులు ముడిపడి
అడుగులు జత పడి
కొంగుముడితో ఇష్టంగా కట్టుబడి
ఏడడుగులు నడిచి మనువాడి
తనువులు తలపడి
బ్రహ్మచర్యం మరుగున పడి
మదిగుడిలోన సవ్వడితో
బంధం బలపడిన ఘడియలు

అసంపూర్ణ జీవితానికి అనుకోని అతిధిగా
ఆజన్మాంతము జతగా ఉండే ఆత్మబంధువై అర్థాంగిగా వచ్చిన
మరల మరల రాని మరపురాని అపురూపమైన అరుదైన మధుర క్షణాల వైవాహిక సంపూర్ణ జీవితానికి పది వసంతాలు నేటితో …..

ఆత్మీయతా అనుబంధాలను అందాల అల్లికగా అమర్చి
మమతానురాగాలను మైలురాళ్లుగా మలచి
పంచుకున్న పెంచుకున్న అనుభూతులను మధుర జ్ఞాపకాలుగా చేసి
బతుకుబాటలో బంధాలను, బాంధవ్యాలను బహుమతిగా ఇచ్చి
బాధ్యతలకు , భారాలకు భయపడకుండా బహు ఇష్టంగా స్వీకరించి
అవధులు లేని అనుబంధాలను అక్కున చేర్చుకొని
అనురాగంతో అల్లుకొని అతిధులకు అన్నపూర్ణవై

నాన్న హోదా ని కల్పించి పిల్లల ఆటపాటల ఆనందాలు ఆస్వాదించే అదృష్టాన్ని అందించి

దిగులు దుప్పటిలో దాగివున్నప్పుడు, రెప్ప పడని క్షణాల్లో
ఓదార్పు పలుకుల పలకరింపుల చినుకులతో అలిసిన మనసుకు ఆలంబనగా
చిరునవ్వు వెలుగులతో స్వాగతం పలుకుతూ
ఆశల తీరాల ప్రయాణంలోని అడుగుజాడలలో అండగా, ఆసరాగా వుంటూ
అంతరంగంలోని ఆలోచన తరంగాలకు అనునిత్యం ఆత్మవిశ్వాసాన్ని అందిస్తూ
ఆశలకు ఆశయాలకు అనంగీకారము, అర్థాంగీకారము కాకుండా అర్దాంగిగా సంపూర్ణ అంగీకారము అందిస్తూ

జల జల జాలు వారే జలపాతాల జోరులా సాగే నా వాగ్దాటికి తట్టుకునే ఓపికకు మెచ్చుకుంటూ

ఆర్భాటాలకు, ఆడంబరాలకు ఆమడ దూరంలో, వాస్తవానికి చేరువలో వుంటూ
ఆర్థిక సంబంధాలకు ఇబ్బందులు కలగకుండా అందించే సహాయ సహకారాలకు జోహార్లు అర్పిస్తూ

నా అక్షర ప్రవాహానికి ఇంతటితో అడ్డుకట్ట వేస్తూ
సంసార సాగర సామ్రాజ్యమునకు రాణిగా ,మహారాణిగా
అందుకో అభినందన వందనాల మందారమాల మన పెళ్లిరోజు శుభాకాంక్షలుగా…

నీ ప్రియాతి ప్రియమైన నేస్తం
——-రాజీప్రతాప్

Prathap Reddy:
Related Post